: స్టేట్ గెస్ట్ హౌస్ లో రాహుల్ గాంధీకి గదివ్వలేదు...‘మహా’ సీఎం ఫడ్నవీస్ పై కాంగ్రెస్ ఆరోపణ


ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల (ఈ నెల 15, 16తేదీల్లో) పాటు తన పర్యటనను ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లారు. రాహుల్ పర్యటన ముగిసిన మూడు రోజులకు గాని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన పొరపాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తు రాలేదు. నిన్న మీడియా ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ సంజయ్ నిరుపమ్ విచిత్ర ఆరోపణ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్ గదిని కేటాయించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశామన్న నిరుపమ్... ఫడ్నవీస్ నుంచి గాని, సీఎంఓ నుంచి గాని ఆ లేఖకు ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. దీంతో రాహుల్ గాంధీ వేరే చోట బస చేయాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నిరుపమ్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘మోదీ డిజిటల్ ఇండియా మాటను వల్లె వేస్తుంటే... మోదీ పార్టీకి చెందిన ఫడ్నవీస్ కనీసం ఈ-మెయిల్ కు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు’’ అని ఆయన విమర్శించారు. అయితే నిరుపమ్ ఆరోపణలను ఫడ్నవీస్ నిన్ననే ఖండించారు. స్టేట్ గెస్ట్ హౌస్ లో రాహుల్ గాంధీ కోసం ఓ సూట్ ను కేటాయించామని, రాహుల్ గాంధీ అందులో దిగలేదని పేర్కొన్నారు. ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీకి భద్రతా ఏర్పాట్లు చేసిన తాము, బస వసతిని కూడా ఏర్పాటు చేశామని, అయితే కాంగ్రెస్ పార్టీనే స్పందించలేదని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News