: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయి జల సమాధి అయిన 25 మంది పంజాబ్ యువకులు!


అమెరికాకు వెళ్లి మరింతగా సంపాదించాలన్న 25 మంది పంజాబ్ యువకుల కలలు కల్లలయ్యాయి. చట్టవ్యతిరేక మార్గాల ద్వారా అమెరికా చేరుకోవాలని బయలుదేరిన వీరు, సముద్ర మార్గాన్ని ఎంచుకుని పడవలో ప్రయాణిస్తుండగా అది పనామా సమీపంలో నీట మునిగింది. జనవరి 10న ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఆపై నాలుగు రోజుల తరువాతనే కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, వారు కపుర్తలా పోలీసులను ఆశ్రయించారు. ఈ పడవ ప్రమాదం నుంచి బయటపడిన సోనూ, జలంధర్ సమీపంలోని భోగ్ పూర్ నివాసి కాగా, తన బంధువులకు ప్రమాదం గురించిన సమాచారం చేరవేశాడు. వీరంతా యూఎస్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజంట్లకు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ చెల్లించారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, వీరి ట్రావెల్ ఏజంట్ రాజేందర్ సింగ్ పై కేసు పెట్టామని, ఆయన కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. తక్షణం భారత ప్రభుత్వం అమెరికాకు ఓ బృందాన్ని పంపి మృతదేహాలు తెప్పించాలని మోదీ సర్కారును బాదల్ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో బాదల్ టెలిఫోన్లో మాట్లాడారని, అమెరికా దౌత్యాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News