: జీహెచ్ఎంసీ బరిలో ‘ఓటుకు నోటు’ చౌదరి!...బీజేపీ వద్దన్నా, టికెట్ ఇప్పించిన లోకేశ్?
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. రోజుల తరబడి జరిగిన చర్చల్లో ఎట్టకేలకు ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. 90 సీట్లలో టీడీపీ, 60 సీట్లలో బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో వెంగళరావు నగర్ డివిజన్ టీడీపీ వాటా కిందకు వెళ్లింది. ఈ డివిజన్ నుంచి యువనేత ప్రదీప్ చౌదరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ‘ఓటుకు నోటు’ కేసులో ప్రదీప్ చౌదరి పేరు చక్కర్లు కొట్టింది. ఈ కేసు విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ అధికారులు చౌదరిని పలుమార్లు పిలిచి విచారించారు. ఈ కేసులో చౌదరికి సంబంధం ఉందో, లేదోనన్న విషయాన్ని పక్కనబెడితే... కేసులో పోలీసులు విచారించిన చౌదరిని బరిలోకి దింపే విషయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక సదరు స్థానాన్ని తమకు కేటాయించాలని కూడా పట్టుబట్టింది. అయితే, చౌదరి తరఫు నేతలు వెనువెంటనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను సంప్రదించారట. దీంతో నేరుగా రంగంలోకి దిగిన లోకేశ్ బీజేపీ నేతలకు సర్ది చెప్పి పట్టుబట్టి మరీ చౌదరికి టికెట్ ఇప్పించారట.