: రోహిత్ ఆత్మహత్యతో నాకు, బీజేపీకి సంబంధం లేదు: దత్తన్న
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకుని మరణించిన రోహిత్ విషయంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఈ కేసులో ఆయన రాసిన లేఖ కీలకమై, అందువల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో, గచ్చీబౌలీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కాగా, ఈ మధ్యాహ్నం దత్తాత్రేయ స్పందించారు. వర్శిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందినందునే తాను లేఖ రాశానని ఆయన చెప్పారు. ఏబీవీపీ కార్యకర్తలను దారుణంగా కొట్టినందునే తాను కేంద్ర మానవ మంత్రిత్వ శాఖకు లేఖను పంపానని, ఆపై ఏం జరిగిందన్నది తనకు తెలియదని అన్నారు. దీనిపై తనకుగానీ, తన పార్టీకి గానీ సంబంధం లేదని, విచారణ జరిగితే అన్ని సంగతులూ బయటకు వస్తాయని అన్నారు. తనపై పెట్టిన కేసుల గురించి ఏమీ వ్యాఖ్యానించబోనని అన్నారు.