: సంచలనం... టెన్నిస్ లో ఫిక్సింగ్ కుంభకోణం, గ్రాండ్ స్లామ్ విజేతలూ పాత్రధారులే!


ప్రపంచ క్రీడారంగాన్ని కుదిపేసే వార్త ఇది. అందరూ ఎంతో ఇష్టంగా తిలకించే టెన్నిస్ పోటీల్లో ఫిక్సింగ్ కుంభకోణం జరిగిందన్నదే ఈ వార్త. గత దశాబ్ద కాలంలో టాప్-50 ర్యాంకింగ్స్ లో ఉన్నవారు, గ్రాండ్ స్లామ్ విజేతలు కూడా ఫిక్సింగ్ కుంభకోణంలో అనుమానితులే. ఈ కుంభకోణానికి సంబంధించిన సీక్రెట్ ఫైళ్లను, సాక్ష్యాలనూ తాము చూశామని బీబీసీతో పాటు 'బుజ్ ఫీడ్ న్యూస్' వెల్లడించింది. వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ లోని ఉన్నతస్థాయి అధికారుల మధ్య అవినీతి జరిగిందని పేర్కొంది. "గడచిన పదేళ్లలో 50 కన్నా తక్కువ ర్యాంకును పొందిన పేరున్న ఆటగాళ్లలో కనీసం 16 మంది ఈ కుంభకోణంలో ఉన్నారు. వారు మ్యాచ్ లను వదిలేసుకున్న తీరు, మ్యాచ్ లలో గెలిచిన వైనం ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది" అని బీబీసీ పేర్కొంది. నేటి నుంచి ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానున్న సందర్భంలో విడుదలైన ఈ రిపోర్టు టెన్నిస్ వర్గాల్లో సంచలనం కలిగించింది. 2007లో మెన్స్ టెన్నిస్ టూర్ లను పర్యవేక్షించే ఏటీపీ ఈ విషయమై 2007లోనే విచారణ ప్రారంభించి, ఆటగాళ్లకు వ్యతిరేకంగా పలు వివరాలు సేకరించిందని బీబీసీ వెల్లడించింది. రష్యా, ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న బెట్టింగ్ సిండికేట్లు ఒక్కో మ్యాచ్ పై కోట్లను గుమ్మరించి వాటిని ఫిక్స్ చేసేవని తెలిపింది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పోటీల్లో కనీసం 3 మ్యాచ్ లు ఫిక్సింగ్ కు గురైనట్టు తెలుస్తోందని బీబీసీ పేర్కొంది. "అత్యంత రహస్యమైన ఈ నివేదికలో, 28 మంది ఆటగాళ్లకు ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రమేయమున్నట్టు పేర్కొనబడింది. వారిపై తదుపరి విచారణకు సంబంధించిన వివరాలు మాత్రం లేవు" అని బీబీసీ వెల్లడించింది. ఈ కథనాలపై స్పందిస్తూ, వార్తా ప్రసార మాధ్యమాల్లో వచ్చిన రిపోర్టులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఏటీపీ చీఫ్ క్రిస్ కెర్మోడ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News