: చంద్రబాబు సమక్షంలో సోమిరెడ్డి, ఆనం 'ఎత్తిపొడుపు' సంవాదం!
వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇద్దరు ప్రముఖ నేతలు, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒకే పార్టీలో ఉంటూ, ఒకే వేదికపై కలిస్తే... ఉప్పు-నిప్పులా తీవ్ర విమర్శలు చేసుకున్న నేతలు ఒకే చోట పక్కపక్కన కూర్చోవాల్సి వస్తే... నిన్న నెల్లూరు జిల్లా ప్రధాన రాజకీయ నేతలైన ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరిన సందర్భంగా ఓ ఆసక్తికర సంవాదం జరిగింది. నెల్లూరు టీడీపీలో తిరుగులేని నేతైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేదికపై ఉండగా, అప్పుడే తెలుగుదేశంలో చేరిన ఆనం వివేకానంద రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఎత్తిపొడుపు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఆనం వివేకానంద రెడ్డి ప్రసంగిస్తూ, "జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్యేలు. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకునేలా కృషి చేద్దాం" అనగా, దానికి సోమిరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "గత ఎన్నికల్లో మూడు సీట్లే గెలిచామని చెబుతున్నారు. సరే. 1989లో మీరు టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు ఒక్క సీటు కూడా రాలేదు. ఆపై 1994లో (ఆనం సోదరులు కాంగ్రెస్ లో ఉన్నారు) జిల్లాలో మొత్తం సీట్లను మేం గెలుచుకున్నాం" అని గుర్తు చేశారు. తాను సోమిరెడ్డి నాయకత్వంలోనూ పనిచేస్తానని ఆనం వెల్లడించగా, టీడీపీలో చంద్రబాబు నాయకత్వం మాత్రమే ఉంటుందని సోమిరెడ్డి స్పష్టం చేశారు.