: సిక్కిం మాజీ గవర్నర్ రామారావు మృతి...ప్రముఖుల సంతాపం
సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు (81) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాదు జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో శ్వాసకోశ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 1935 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయన జన్మించారు. 1956లో జనసంఘ్ లో చేరిన ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంతరం బీజేపీ జాతీయ నేతగా ఎదిగిన ఆయన, 2002 నుంచి 2005 వరకు సిక్కిం గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తదితరులు సంతాపం తెలిపారు. రామారావుతో తనది సుదీర్ఘ అనుబంధమని, శాసన మండలిలో తామిద్దరం సుదీర్ఘకాలం సమకాలీనులుగా ఉన్నామని రోశయ్య చెప్పారు.