: మోదీపై శత్రుఘ్నసిన్హా ప్రశంసల వర్షం... డైనమిక్ అండ్ యాక్షన్ హీరోగా అభివర్ణన
ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై ఆ పార్టీ నేత, బాలీవుడ్ అలనాటి హీరో శత్రుఘ్నసిన్హా... పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల జడివాన కురిపించారు. ఈ కారణంగా పాట్నా సాహిబ్ ఎంపీగా ఉన్న సిన్హా పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. అయినా వెనకడుగు వేయని సిన్హా తాను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. తాజాగా నేటి ఉదయం సిన్హా ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అది కూడా పాకిస్థాన్ తో సత్సంబంధాల కోసం నరేంద్ర మోదీ చేస్తున్న యత్నాలను సిన్హా ఆకాశానికెత్తేశారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం నరేంద్ర మోదీ చేపడుతున్న చర్చలు అమోఘమని ఆయన కొనియాడారు. ఈ చర్యలతో నరేంద్ర మోదీ డైనమిక్ అండ్ యాక్షన్ హీరోగానే కనిపిస్తున్నారని కూడా సిన్హా వ్యాఖ్యానించారు. ఈ మేరకు సిన్హా ప్రధానిని పొగడుతూ తన వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.