: 'డేగ'పై 'పర్'ల విజయం!... మూడో రోజూ జోరు తగ్గని కోడి పందాలు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితమే భారీ ఏర్పాట్ల మధ్య మొదలైన పందాలు నేడు మూడో రోజు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ పందాలను వీక్షించేందుకే కాక పందాల్లో పాల్గొనేందుకు ఇతర జిల్లాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో కోడి పందాలు జరుగుతున్న ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ గోడావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో కోడి పందాల జోరు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ముగిసిన కోడి పందాన్ని ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. భీకరంగా జరిగిన ఆ పోటీలో డేగ జాతి కోడిపై ‘పర్ల’ జాతికి చెందిన కోడి విజయం సాధించింది. సుదీర్ఘంగా సాగిన పోటీలో పర్ల కోడి దెబ్బకు మెడ తెగిపోయిన స్థితిలో డేగ జాతి కోడి తల వాల్చేసింది. దీంతో పర్ల కోడి గెలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఓడిన కోడిని కూరగా మార్చేసి వండుకుని తింటామని విజేత కోడి యజమానులు చెప్పారు. ఓడిన కోడి మాంసానికి కూడా అక్కడ ఫుల్ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఓడిన ఓక్కో కోడిని రూ.4 నుంచి 5 వేలు పెట్టి మరీ కొంటారు. ఇక ఓడిన కోడి చేసిన దాడిలో గెలిచిన పర్ల కోడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స చేసి వచ్చే ఏడాది పోటీలకు సిద్ధం చేయనున్నట్లు దాని యజమానులు తెలిపారు. ఈ గాయాలు తగ్గేందుకు కనీసం 20 రోజుల సమయం పడుతుందని కూడా వారు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.