: బాలయ్య నోట కేబినెట్ మాట... పదవిపై కాంక్ష లేదని కామెంట్
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నోట కేబినెట్ మాట వినిపించింది. గడచిన ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడిన బాలయ్య... తన తండ్రి ఎన్టీఆర్ కు మంచి పట్టున్న అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఎన్టీఆర్ ను గెలిపించినట్లుగానే బాలయ్యనూ హిందూపురం ప్రజలు భారీ మెజారిటీతోనే గెలిపించారు. ఎమ్మెల్యేగా బాలయ్య విజయం సాధించడం... ఏపీలో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో బాలయ్య మంత్రి కావడం కూడా ఖాయమేనన్న వాదన వినిపించిది. అయితే ఆ దిశగా ఇటు బాలయ్య కాని, అటు చంద్రబాబు కాని అడుగు ముందకేయలేదు. తాజాగా సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన బాలయ్య తన బావ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేబినెట్ మార్పు చేర్పులపై మాట్లాడారు. కేబినెట్ రీషఫిలింగ్ సీఎం ఇష్టమని పేర్కొన్న బాలయ్య, తనకు మాత్రం పదవులపై కాంక్ష లేదని చెప్పారు. తనను గెలిపించిన హిందూపురం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎప్పుడూ కేబినెట్ గురించి మాట్లాడని బాలయ్య నోట తాజాగా కేబినెట్ మాట వినిపించడంతో ఆయన కూడా పదవిని ఆశిస్తున్నారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.