: మసూద్ ఎన్నటికీ అరెస్ట్ కాడు!... జైషే సంచలన ప్రకటన
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఒత్తిడితో పాకిస్థాన్ ప్రభుత్వం కరుడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అతడికి గృహ నిర్బంధం విధించిన పాక్ ప్రభుత్వం, పఠాన్ కోట్ దాడిలో అతడి ప్రమేయముందని తేలితే అరెస్ట్ చేస్తామని కూడా ప్రకటించింది. అయితే మసూద్ నేతృత్వం వహిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ నేటి ఉదయం ఓ సంచలన ప్రకటన చేసింది. మసూద్ అరెస్ట్ ఎన్నటికీ సాధ్యం కాదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజీలో జైషే మొహ్మద్ సదరు ప్రకటనను పోస్ట్ చేసింది. ‘‘మసూద్ అరెస్టయ్యాడంటూ ప్రపంచంలోని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మసూద్ ఎన్నటికీ అరెస్ట్ కాడు’’ అని ఆ పోస్ట్ లో జైషే పేర్కొంది.