: ‘రక్షక బందీ’గా మసూద్... అరెస్ట్ కాదని ప్రకటించిన పాక్ మంత్రి
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి సూత్రధారిగా భారత్ ఆరోపిస్తున్న జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ అరెస్ట్ పై పాకిస్థాన్ పిల్లిమొగ్గలేస్తోంది. మొన్న రాత్రి మసూద్ ను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆ దేశ మీడియా కోడై కూసింది. అయితే మసూద్ అరెస్ట్ పై తమకు సమాచారం లేదని నిన్న పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో మసూద్ అరెస్ట్ కాలేదన్న విషయాన్ని పాక్ పరోక్షంగా స్పష్టం చేసింది. దీంతో నేడు ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడిపోయాయి. మసూద్ ను అదుపులోకి తీసుకున్నామని నేటి ఉదయం పాక్ లోని పంజాబ్ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రానా సనావుల్లా ప్రకటించారు. మసూద్ ను ‘రక్షక బందీ’ (ప్రొటెక్టివ్ కస్టడీ)గా అదుపులోకి తీసుకున్నామని చెప్పిన సనావుల్లా... అరెస్ట్ మాత్రం చేయలేదని ప్రకటించారు. ‘‘పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి కేసులో మసూద్ సహా అతడి అనుచరులను పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం రక్షక బందీలుగా అదుపులోకి తీసుకుంది. దాడిలో మసూద్ ప్రమేయం ఉందని తేలిన తర్వాతే అతడిని అరెస్ట్ చేస్తాం’’ అని సనావుల్లా చెప్పినట్లు పాక్ మీడియా సంస్థ ‘డాన్ న్యూస్’ వెల్లడించింది.