: వారిద్దరూ 'ఉత్త'కుమార్, 'వట్టి'విక్రమార్క ...ఇక ఈ ఎన్నికలతో టీడీపీ అంతర్థానమే!: కేటీఆర్
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏడు నుంచి ఎనిమిది సీట్లు మాత్రమే వస్తాయని ఆ పార్టీ చేసుకున్న అంతర్గత సర్వేలో తేలిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలపై తీవ్ర విమర్శలు చేశారు. "ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు 'ఉత్త'కుమార్ రెడ్డి, అలాగే ఆయన భట్టి విక్రమార్క కాదు 'వట్టి' విక్రమార్క. వీరిద్దరూ 'టీవీ' లీడర్లు మాత్రమే" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వీరికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, కేటీఆర్ చెబితే సరిపోతుందని ఆయన చెప్పారు. ఇకపోతే, తెలంగాణలో టీడీపీ పూర్తిగా అంతర్థానమవుతుందని ఆయన చెప్పారు. ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా ఆ విషయం తెలుసని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల తరువాత టీడీపీలో ఉన్న ఇతర నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరుతారని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కేవలం ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉందని, అది అక్కడికే పరిమితమవుతుందని ఆయన స్పష్టం చేశారు.