: ఉగ్రవాదుల్లో చేరేందుకు ఇండియా నుంచి నలుగురు వస్తే, అరెస్ట్ చేశామన్న సిరియా ఉప ప్రధాని
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరాలన్న ఉద్దేశంతో ఇండియా నుంచి బయలుదేరి సిరియాకు చేరుకున్న నలుగురు భారత యువకులను డమాస్కస్ లో అదుపులోకి తీసుకున్నామని సిరియా ఉప ప్రధాని వాలిద్ అల్-ముల్లెమ్ వెల్లడించారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన, ఈ నలుగురూ ఎవరన్న విషయమై భారత అధికారులతో చర్చిస్తున్నట్టు తెలిపారు. వీరు ఇండియా నుంచి జోర్డాన్ మీదుగా సిరియాలోకి ప్రవేశించారని వెల్లడించిన ఆయన, వీరు ఎప్పుడు వచ్చారన్న విషయాన్ని తెలియజేయలేదు. కాగా, ఇటీవలి కాలంలో ఐఎస్ఐఎస్ లో చేరాలన్న ఉద్దేశంతో బయలుదేరి పట్టుబడుతున్న యువకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 2014లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయులను విడిపించే శక్తి తనకు లేదని వాలిద్ వ్యాఖ్యానించడం గమనార్హం. వారు ఇరాక్ కస్టడీలో ఉంటే విడిపించే చర్యలు చేపడతామని, ఒకవేళ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉంటే మాత్రం ఏమీ చేయలేమని అన్నారు.