: రేపే చర్చలు... నేడు తుది నిర్ణయం!: భారత్-పాక్ చర్చలపై ఉత్కంఠ


2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రవాదుల మారణ హోమం తర్వాత భారత్, పాకిస్థాన్ ల మధ్య చర్చలు దాదాపుగా నిలిచిపోయాయి. చర్చలకు సిద్ధమని పాక్ ప్రకటించినా, ముంబై సూత్రధారులపై చర్యలు తీసుకునేదాకా ఆ సమస్యే లేదని భారత్ తేల్చిచెప్పింది. అయితే నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో కాస్తంత మార్పు వచ్చింది. ఇరు దేశాల మధ్య చర్చలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగిస్తూ మోదీ కీలక అడుగు వేశారు. దీనికి నవాజ్ షరీప్ నుంచి కూడా మంచి స్పందనే లభించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఆత్మీయ భేటీ నేపథ్యంలో వెనువెంటనే ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ, ఆ తర్వాత పాక్ లో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటన, లాహోర్ లో మోదీ సడెన్ ల్యాండింగ్ వేగంగా జరిగిపోయాయి. ఇక ఇరు దేశాల మధ్య అసలైన చర్చలుగా భావిస్తున్న విదేశాంగ శాఖ కార్యదర్శుల చర్చలు రేపు జరగనున్నాయి. గత నెలలోనే ఖరారైన ఈ చర్చలు... ఈ నెల పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల మెరుపు దాడితో ప్రశ్నార్థకంగా మారాయి. ఈ దాడుల సూత్రధారులు కూడా పాక్ లోనే ఉన్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే కాని చర్చలకు సిద్ధం కాలేమని పాక్ కు భారత్ తేల్చిచెప్పింది. ఈ క్రమంలో చర్చలు దాదాపుగా రద్దయినట్లేనన్న వాదన వినిపించింది. అయితే ఈ దఫా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పాక్ ప్రభుత్వం... ఈ నెల 15న చర్చలు జరిగి తీరతాయని ప్రకటించింది. చర్చలకు రెండు రోజుల సమయముందనగా, పఠాన్ కోట్ దాడి సూత్రధారిగా భారత్ ఆరోపిస్తున్న జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను నిన్న పాక్ అరెస్ట్ చేసింది. దీంతో భారత్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నట్లు పాక్ చెప్పకనే చెప్పింది. అయితే అజార్ అరెస్ట్ కు సంబంధించి పాక్ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని భారత విదేశాంగ శాఖ వర్గాలు వాదిస్తున్నాయి. మరోవైపు ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం రేపు ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ జరగాల్సి ఉంది. అయితే నిన్నటిదాకా భారత్ నుంచి ఈ దిశగా ఎలాంటి ప్రకటన రాలేదు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేడు ఢిల్లీ చేరుకోనున్నారు. నేడు మరోమారు సుష్మా, అజిత్ దోవల్ లతో కీలక భేటీ నిర్వహించనున్న నరేంద్ర మోదీ చర్చలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? లేదా? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ నుంచి వెలువడే ప్రకటన కోసం ఇరు దేశాల ప్రజలే కాక ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News