: విజయనగరం జిల్లాలో సూదిగాడు ప్రత్యక్షం!
సూదిగాడు మళ్లీ వార్తల్లోకి వస్తున్నాడు. తాజాగా, విజయనగరం జిల్లా పార్వతీపురంలో గుర్తుతెలియని దుండగుడు ఒక బాలికను సూదితో గుచ్చిపారిపోయాడు. పార్వతీపురంలోని జగన్నాథపురం ప్రాంతంలో ఈరోజు ఈ సంఘటన జరిగింది. నాగేశ్వరరావు కుమార్తె మౌనిక (9) రోడ్డుపై నడిచి వెళుతోంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మోచేతిపై సూదితో గుచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. బాధతో మౌనిక విలవిలలాడుతుండటాన్ని గమనించిన అక్కడి వ్యక్తులు సూదిగాడి కోసం గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం బాలికకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.