: ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు... శ్రీవారి ఆర్జిత సేవలన్నీ ఆన్ లైన్ ద్వారానే!


తిరుమల శ్రీవారికి జరిగే నిత్య, వారపు సేవల టికెట్లన్నీ ఇకపై ఆన్ లైన్ మాధ్యమంగానే విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి సేవలో కొన్ని టికెట్లను మాత్రం టీటీడీ అధికారుల విచక్షణ కోటా కింద ఉంచాలని, మిగతా అన్నింటినీ ఆన్ లైన్లో విక్రయించి, కరెంట్ బుకింగ్ నిలిపివేయనున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. అత్యంత పరిమితంగా 25 టికెట్లను మాత్రమే కేటాయించే తిరుప్పావడ, సహస్ర కలశాభిషేకం సేవలను మాత్రం పూర్తిగా విచక్షణ కిందే కేటాయించాలని నిర్ణయించారు. మిగిలిన వారపు సేవా టికెట్లయిన నిజపాద దర్శనం వంటి సేవల్లో 75 శాతం వరకూ ఆన్ లైన్లో, ఆపై సుప్రభాతం, తోమాల సేవ, కల్యాణం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం వంటి అన్ని నిత్యసేవా టికెట్లను 100 శాతం ఆన్ లైన్లోనే విక్రయించనున్నారు. ఇకపై తిరుమలకు వెళ్లి, సేవా టికెట్ల కోసం రాత్రంతా క్యూలైన్లలో వేచి చూసే అవసరం లేకుండా చేయడంతో పాటు, సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మరింత సౌలభ్యంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో టీటీడీ ఎప్పుడు సేవా టికెట్లను ఆన్ లైన్లో ఉంచినా, గంటల వ్యవధిలో విక్రయించబడుతుండడం, ఆన్ లైన్ వాడకం పల్లెలకూ విస్తరించిన నేపథ్యంలో ఈ కొత్త విధానం టికెట్ల జారీని మరింత పారదర్శకం చేస్తుందని, విమర్శలు దూరమవుతాయని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News