: జీహెచ్ఎంసీ నిధులు హైదరాబాదుకే...టీఎస్ఆర్టీసీకి కాదు: నారా లోకేష్
తెలంగాణలో టీడీపీ గుర్తింపుతో గెలిచి, స్వార్ధంతో పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం జెండాను నిలబెట్టారని టీడీపీ సెంట్రల్ కమిటీ సమన్వయకర్త నారా లోకేష్ తెలిపారు. హైదరాబాదులో నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ ఒడ్డున వంద అంతస్తుల భవంతులు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు, పనులు ప్రారంభమయ్యాయా? అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేస్తానని, ఆ నీటిని మంచినీరు చేస్తానని ప్రగల్భాలు పలికారు. అవి పూర్తయ్యాయా? అని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ మాట్లాడి, పని చేయని ఘనత తెలంగాణ ప్రభుత్వానిదయితే, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడం టీడీపీ ప్రత్యేకత అని ఆయన చెప్పారు. మిగులు బడ్జెట్ తో పయనం ప్రారంభించిన తెలంగాణ, ఏపీతో పోల్చుకుంటే ఎంత అభివృద్ధి చెందాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఎవరని ఆయన అడిగారు. టీడీపీ, బీజేపీలు మాటలు చెప్పే పార్టీలు కాదని, చేతలు చూపే పార్టీలని ఆయన తెలిపారు. హైదరాబాదులో సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి ఆర్టీసీని బలోపేతం చేస్తానంటే ఎలా? హైదరాబాదును అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ నిధులు స్వాహా చేసేందుకే దానిలో వివిధ శాఖలను విలీనం చేస్తామంటున్నారని ఆయన ఆరోపించారు.