: నేను మాటమీద నిలబడ్డాను...ఎప్పుడూ నిలబడతాను: చంద్రబాబు
ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కార్యకర్తలు తనను ఎంతో ఆదరించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో త్యాగాలు చేసి కార్యకర్తలు టీడీపీ వెన్నంటి నిలిచారని, వారి త్యాగాలు, ఆదరణ మరువలేనని అన్నారు. దేశంలో సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని ఆయన చెప్పారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి అని, తెలుగు ప్రజల ఖ్యాతి దిగంతాలకు వ్యాప్తి చేయాలని భావించానని ఆయన చెప్పారు. అందుకే విమర్శలు వస్తున్నా లెక్కచేయకుండా తనిఖీలు నిర్వహిస్తూ, అధికారులను అప్రమత్తం చేశానని ఆయన చెప్పారు. ఆనాటి కష్టమే ఇప్పుడు ప్రతిఫలిస్తోందని ఆయన చెప్పారు. అప్పటి పట్టణ స్థితిగతులకు అనుగుణంగా రోడ్లను వెడల్పు చేశానని ఆయన గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసిన ఘనత టీడీపీ, ఎన్డీయే ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. హైదరాబాదు ప్రజలు మనస్సాక్షితో ఆలోచిస్తే, హైదరాబాదును ఎవరు అభివృద్ధి చేశారో తెలుస్తుందని ఆయన చెప్పారు. తాను చేపట్టిన చర్యల వల్ల 4 లక్షల ఉద్యోగాలు ఐటీ పరిశ్రమలో వస్తే, తద్వారా 12 లక్షల పరోక్ష ఉపాధి దొరికిందని ఆయన వెల్లడించారు. అప్పట్లో ఎన్నో సంస్కరణలు చేపడితే ఈ నాటి ఈ రూపం వచ్చిందని ఆయన చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో ఉన్న ఇన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రావడానికి కారణం టీడీపీ అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని వివిధ పరిశ్రమలు తీసుకొచ్చామని ఆయన అన్నారు. హైదరాబాదుకు తన జీవితంలో చేసిన శ్రమ, ఇంకెక్కడా చేయలేదని ఆయన చెప్పారు. హైదరాబాదు మరింత ప్రగతి పథంలో నడవాలని, అందుకు టీడీపీ సహాయపడుతుందని ఆయన వెల్లడించారు. విభజననాడు ఏం చెప్పానో, ఇప్పటికీ అదే మాటమీద నిలబడ్డానని, మాటలు మార్చడం తనకు చేతకాదని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 30 ఏళ్లు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడతానని ఆయన తెలిపారు.