: స్మిత్, బెయిలీ ఇన్నింగ్స్ ముందు తేలిపోయిన రోహిత్, కోహ్లీ ఇన్నింగ్స్...ఆసీస్ దే తొలి వన్డే
ఆసీస్ పర్యటనను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (149), జార్జ్ బెయిలీ (112) ఇన్నింగ్స్ ముందు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ (171), విరాట్ కోహ్లీ (91) ఇన్నింగ్స్ వెలవెలబోయాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కుదురుకుంటున్న దశలో ధావన్ వికెట్ కోల్పోయింది. అనంతరం రోహిత్, కోహ్లీ భారత జట్టు స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో టీమిండియా 309 పరుగులు చేసింది. అనంతరం 310 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే భారత బౌలర్లు ఆ ఒత్తిడిని కొనసాగించడంలో విఫలమయ్యారు. ఈ సిరీస్ తో అరంగేట్రం చేసిన బరిందర్ స్రాహ ఫించ్ (8) వార్నర్ (5)ల వికెట్లు తీసి రాణించగా, అతనికి ఒక్కరు కూడా సహకారమందించకపోడం విశేషం. దీంతో క్రీజులో కుదురుకున్న స్టీవ్ స్మిత్, జార్జ్ బెయిలీ స్కోరును జాగ్రత్తగా పెంచుకుంటూ పోయారు. అర్ధ సెంచరీలు సాధించిన అనంతరం వీరిద్దరూ జూలు విదిల్చారు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో సెంచరీలు సాధించిన తరువాత మరింత ధాటిగా ఆడే క్రమంలో వీరు వికెట్లు కోల్పోయారు. అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్ మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.