: ముంబై పోలీసుల ‘16 మిస్టేక్’లతోనే సల్మాన్ బయటపడ్డాడట!
2002లో ముంబై వీధుల్లో తప్పతాగి కారు నడిపిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రోడ్డు పక్కగా నిద్రిస్తున్న వారిపై కారును ఎక్కించాడు. ఆ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగి ఇటీవలే ముగిసింది. కేసును విచారించిన కింది కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారిస్తే, హైకోర్టు మాత్రం అతడి తప్పేమీ లేదని శిక్షను రద్దు చేసింది. అసలు సల్మాన్ ఖాన్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అతడి తరఫు న్యాయవాదుల సమర్ధ వాదనలేమీ కారణం కాదని తేలిపోయింది. కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ముంబై పోలీసు శాఖ చేసిన ‘16 తప్పుల’ కారణంగానే సల్మాన్ ఈ కేసు నుంచి బయటపడ్డాడట. ఇదేదో కోర్టు న్యాయమూర్తులో, న్యాయవాదులో చెప్పిన విషయం కాదు. సాక్షాత్తు ముంబై పోలీసు బాసు చెప్పిన పచ్చి నిజం. ముంబై అదనపు పోలీసు కమిషనర్ (క్రైం) కేఎంఎం ప్రసన్న ఈ మేరకు తేల్చేశారు. అంతేకాక సదరు తప్పులను ప్రస్తావిస్తూ ఆయన నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఓ సర్క్యులర్ కూడా పంపారు. సదరు సర్క్యులర్ లో ముంబై పోలీసులు చేసిన తప్పులేంటనే విషయాన్ని వరుస క్రమంలో ప్రసన్న పేర్కొన్నారు. 1. రెయిన్ బార్ లో సేకరించిన బిల్లులు 2. జేడబ్ల్యూ మారియట్ హోటల్ బిల్లులు. సల్మాన్ కారుకున్న హోటల్ పార్కింగ్ ట్యాగ్ 3. రెయిన్ బార్ బిల్లులపై చేతిరాతలు 4. 2002 సెప్టెంబర్ ఉదయమే వైద్య పరీక్షలకు సల్మాన్ అందుబాటులోనే ఉన్నాడు. అయితే అతడిని పోలీసులు మధ్యాహ్నం జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు. 5. బాధితుడి రక్త నమూనాలను బాబా ఆసుపత్రిలో సేకరిస్తే... సల్మాన్ శాంపిళ్లను మాత్రం జేజే ఆసుపత్రిలో సేకరించారు. ఇందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనలేదు. 6. సల్మాన్ బ్లడ్ శాంపిళ్లు సెప్టెంబర్ 28ననే బాంద్రా పోలీస్ స్టేషన్ కు చేరినా, అదే నెల 30న కానీ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించలేదు. 7. సల్మాన్ బ్లడ్ శాంపిళ్ల తరలింపునకు సంబంధించి పక్కా రికార్డులు లేవు. దీంతో మిస్సైన లింక్ ను కనుగొనలేకపోయారు 8. సల్మాన్ బ్లడ్ శాంపిళ్లను ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన కానిస్టేబుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేయలేదు. 9. సల్మాన్ బాడీ నుంచి 6 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తే... ల్యాబ్ కు 4 మిల్లీ లీటర్లు మాత్రమే చేరింది. 10. ఇక సదరు శాంపిళ్లను తీసుకున్న ఫోరెన్సిక్ ల్యాబ్ క్లర్క్ ను కూడా ప్రశ్నించలేదు. 11. దర్యాప్తు అధికారి వైద్యులు అందించిన పత్రాలను సరిగా పరిశీలించలేదు. 12. బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ లోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేయలేదు. 13. ఎఫ్ఐఆర్ లో రెండు చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి. కారణాలు పేర్కొనలేదు. 14. సెక్షన్ 161 కింద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయగా, ఏ ఒక్కరూ సల్మాన్ కారు నడిపినట్లు చెప్పలేదు. 15. టైరు బరస్ట్ అయిన కారణంగానే కారు అదుపు తప్పిందని చెప్పారు. అయితే టైరును ల్యాబ్ పరీక్షలకు పంపలేకపోయారు. 16. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న నటుడు కమల్ ఖాన్ అందుబాటులో ఉన్నా విచారించలేకపోయారు.