: రోహిత్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీ... దూసుకెళ్తున్న భారత్
ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరుగుతున్న తొలి వన్డే పోరులో ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రాణించారు. ఈ క్రమంలో రోహిత్ తన సెంచరీని, కోహ్లీ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. మొత్తం 122 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 100 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ కెరీర్ లో రోహిత్ కు ఇది 9వ సెంచరీ. మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 75 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 71 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 36.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 188 పరుగులు. భారత ఆటగాళ్ల వికెట్లను తీసేందుకు ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయోగాలు ఫలించడం లేదు.