: ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో నకిలీ మద్యం ముఠా!... చిక్కుల్లో కొల్లు రవీంద్ర
కృష్ణా జిల్లా విజయవాడలో వెలుగుచూసిన కల్తీ మద్యం మూలాలు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఉన్నాయా? నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని బలరాంపేట పరిధిలోని మురికి కాల్వలో వెలుగుచూసిన మద్యం బాటిళ్లు అవుననే చెబుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం నుంచే కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్ లో ఎక్సైజ్ శాఖతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. గత నెలలో విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ లో వెలుగుచూసిన కల్తీ మద్యం ఘటన ఐదుగురు కూలీలను బలి తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబానికి చెందిన బార్ లో కల్తీ మద్యం వెలుగుచూడటంతో వేగంగా స్పందించిన ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవలే ఈ కేసులో మల్లాది విష్ణు కూడా అరెస్టయ్యారు. తాజాగా నిన్న సాయంత్రం మచిలీపట్నంలో కల్తీ మద్యం బాటిళ్లు, కొత్త సీసాలకు వినియోగించేందుకు ఉద్దేశించిన మూతలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై ఒక్కసారిగా షాక్ తిన్న ఎక్సైజ్ శాఖాధికారులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. నగరంలోని పలు బార్లు, వైన్ షాపుల యజమానులు కుమ్మక్కై నకిలీ మద్యం తయారీని భారీ ఎత్తున చేపడుతున్నారని ఓ అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో నగరంలో నకిలీ మద్యం తయారీ జరుగుతోందని కూడా ఆ శాఖ ప్రాథమికంగా నిర్ధారించిననట్లు సమాచారం. కల్తీ మద్యం తయారీతో సంబంధం ఉందని భావిస్తున్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మురికి కాల్వలో లభ్యమైన ఖాళీ మద్యం సీసాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాకాలోనే నకిలీ మద్యం వెలుగుచూసిన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్రకు చిక్కులు ఎదురుకాక తప్పేలా లేదు.