: 2016 - బీజేపీ ముందు అతిపెద్ద రాజకీయ సవాళ్లు!


ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు ఏ రికార్డులకు చేరతాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం కానీ, మోదీ నేతృత్వంలోని అధికార బీజేపీకి మాత్రం ఆ వేడి సెగ ఇప్పటికే తాకేసింది. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలైన తరుణంలో 2016 సంవత్సరం ఆ పార్టీకి అతిపెద్ద రాజకీయ సవాళ్లను నిలపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం, ఆ పార్టీ ఈ యేడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి వుంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రాతినిధ్యం అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం 116 లోక్ సభ సీట్లుండగా, అందులో బీజేపీ స్థానాలు నామమాత్రమే. అసోం విషయానికి వస్తే, నాలుగోసారి పీఠాన్ని అధిరోహించిన తిరుగులేని నేతగా ఉన్న తరుణ్ గగోయ్ ని గద్దె దింపడం అనుకున్నంత సులువేం కాదు. అయితే, ఆయన్ను బలహీనపరిచేందుకు బీజేపీ చేసిన యత్నాలు మాత్రం ఫలించాయి. గగోయ్ కి కుడి భుజంగా పేరున్న హేమంత విశ్వ శర్మ, ఇటీవల 9 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలో చేరిపోయారు. శర్మ రాకపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక బెంగాల్ లో వామపక్ష పార్టీల అధికారానికి గండి కొట్టిన నేతగా, అధికార పీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దె దింపడం అంత తేలిక కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఏకమైతే, అధికారం మమతకు మరోసారి దక్కే అవకాశాలు తగ్గుతాయని విశ్లేషకుల అంచనా. పశ్చిమ బెంగాల్ పై బీజేపీకి ఏ మాత్రం ఆశలు లేవు. తమిళనాడు, పుదుచ్చేరి విషయానికి వస్తే, విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ, కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమిళనాట కొన్నయినా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునేందుకు ఈ ఎన్నికలను వాడుకోవాలని భావిస్తోంది. ఇటీవలి వరదలను ఎదుర్కోవడంలో జయ సర్కారు విఫలం అయిందన్న ఆరోపణలు అధికార పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని కలసి పోటీ చేయాలన్నది బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఏఐఏడీఎంకేనా? లేక డీఎంకేనా? అన్నది మాత్రం ఇంకా తేల్చుకోలేదు. ఇక బీజేపీ కాస్తో, కూస్తో ఆశలు పెట్టుకున్న రాష్ట్రంగా కేరళ ఒక్కటే కనిపిస్తోంది. కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ లో గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాలు విపక్ష ఎల్డీఎఫ్ పుంజుకోవడానికి సహకరిస్తున్నాయి. ఇక ఈ రెండు కూటముల మధ్య 2011లో ఓట్ల తేడా స్వల్పం. ఎంతో మంది స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఈ దఫా పోటీ గట్టిగానే సాగుతోంది. 2016లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావచ్చన్న ఆశ ఎక్కడైనా ఉందంటే, అది కేరళలోనే అనుకోవాలేమో!

  • Loading...

More Telugu News