: అమీర్ పేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు... తప్పిన ముప్పు
హైదరాబాదులోని అమీర్ పేట లో కొద్దిసేపటి క్రితం పెద్ద ప్రమాదమే తప్పింది. అమీర్ పేట పరిధిలో ప్రముఖ ఆసుపత్రిగా పేరొందిన ప్రైమ్ హాస్పిటల్స్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రి భవనంలోని లిఫ్ట్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే వెనువెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు మంటలు మరింత మేర వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలేమీ కాలేదు. ఆసుపత్రి భవనంలోని లిఫ్ట్ పాక్షికంగా కాలిపోయింది.