: ఆమిర్ ను దేశద్రోహి అనలేదు!...‘టైమ్స్’కు నోటీసు ఇస్తానంటున్న బీజేపీ ఎంపీ
బాలీవుడ్ మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ను దేశద్రోహిగా అభివర్ణించారంటూ తనపై వెల్లువెత్తుతున్న విమర్శలను బీజేపీ నేత, ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ కొట్టిపారేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన కల్చర్, ట్రాన్స్ పోర్టు రంగాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో భాగంగా మనోజ్ తివారి... ఆమిర్ ను దేశద్రోహిగా అభివర్ణించారంటూ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనం రాసింది. ‘ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా ఆమిర్ ను తొలగించడం మంచిదే అయ్యింది. ఎందుకంటే అతడో దేశద్రోహి’ అని తివారీ వ్యాఖ్యానించారంటూ ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తివారీ నేటి ఉదయం ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చారు. ఆమిర్ ను ఉద్దేశించి తానేమీ మాట్లాడలేదని కూడా ఆయన తెలిపారు. అసత్య కథనాన్ని రాసిన ‘టైమ్స్’కు నోటీసులు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.