: పఠాన్ కోట్ కు మోదీ!... ఎయిర్ బేస్ ను పరిశీలించనున్న ప్రధాని
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ భారత వైమానిక దళానికి కీలక స్థావరం. ఈ నెల 2న పాక్ నుంచి దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎయిర్ బేస్ పై మెరుపు దాడికి దిగారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించుకున్న ఉగ్రవాదులు నేరుగా ఎయిర్ బేస్ లోపలికి చొచ్చుకువెళ్లారు. అయితే వేగంగా స్పందించిన భద్రతా దళాలు ఉగ్రవాదులను నిలువరించాయి. ప్రాణాలు అడ్డుపెట్టి మరీ గరుడ కమెండోలు ఎయిర్ బేస్ లో ఉగ్రవాదుల బీభత్సాన్ని నిలువరించగలిగారు. ఈ ఘటనలో ఏడుగురు కమెండోలు ప్రాణాలు కోల్పోగా, ఎయిర్ బేస్ లోకి దూరిన ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటనతో ఎయిర్ బేస్ లో నాలుగు రోజుల పాటు కాల్పులు మోత మోగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్ బేస్ ను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అక్కడ పర్యటించనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు పఠాన్ కోట్ చేరుకునే మోదీ చాలాసేపు అక్కడే గడపనున్నారు.