: అనంతపురం కోర్టు జారీ చేసింది తప్పుడు వారంట్: ధోనీ లాయర్
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ తప్పుడుదని ధోనీ లాయర్ రజనీశ్ చోప్రా పేర్కొన్నారు. 2013లో బిజినెస్ టుడే లో ధోనీని విష్ణు మూర్తి అవతారంలో వేసిన పత్రిక ఫోటోలో ధోనీ చేతిలో ఓ పాదరక్షను ఉంచింది. దీనిపై అప్పటి విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ ధోనీపై అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరుగుతూ వచ్చింది. వీటికి ధోనీ హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం వచ్చే నెల 25న ధోనీ వ్యక్తిగతంగా హాజరు కావాలని, లేని పక్షంలో అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. దీనిపై ధోనీ లాయర్ రజనీశ్ చోప్రా మాట్లాడుతూ, తమకు న్యాయస్థానం నుంచి ఎలాంటి సమన్లు అందలేదని, అలాంటప్పుడు నాన్ బెయిలబుల్ వారంట్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.