: అమెరికాలో ఉరేసుకున్న తెలుగు విద్యార్థి... అగ్రరాజ్యం ఆంక్షలతో మనస్తాపమే కారణం!
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి శివకరణ్ బండి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీలో శివకరణ్ చదువుతున్నాడు. హైదరాబాదులోని రామాంతపూర్ కు చెందిన శివకరణ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అదికారులు వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపానికి గురైన శివకరణ్ బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. విద్యాభ్యాసం కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులు అక్కడ కొన్ని ప్రాంతాల్లో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నారు. అంతేకాక అమెరికాలోని పలు వర్సిటీలకు విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అర్హత కూడా లేదట. ఈ రెండు కారణాలను సాకుగా చూపుతున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికాలో కాలుమోపిన తెలుగు విద్యార్థులను ఎయిర్ పోర్టుల్లోనే అదుపులోకి తీసుకోవడంతో పాటు గంటల తరబడి విచారణ జరిపి, తిప్పి పంపేస్తున్నారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన కారణంగా శివకరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.