: పఠాన్ కోట్ ముష్కరుల మృతదేహాలకు రష్యా తరహా ట్రీట్ మెంట్ ఇవ్వాలి!: త్రిపుర గవర్నర్ సంచలన వ్యాఖ్య
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ కూడా తన భావోద్వేగాలను అణచుకోలేకపోయారు. ముష్కరుల మృతదేహాలను పంది చర్మంలో చుట్టి, వారి ముఖాలను పంది మలంలో ఉంచి ఖననం చేయాలని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. నిన్న తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు రాయ్ ఘాటు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. టెర్రరిస్టులకు రష్యా చేసిన ఈ తరహా సత్కారాన్ని తాను సూచిస్తున్నట్లు ఆయన ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. చెచెన్యా తిరుగుబాటుదారులకు రష్యా ఈ తరహా సత్కారాన్నే అమలు చేసిందని రాయ్ తెలిపారు. రాయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా, ఆయన మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు.