: ములుగు యూనివర్సిటీకి రూ.75 కోట్లు మంజూరు చేస్తాం: కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఇవాళ ప్రారంభించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీకి రూ.75 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. తక్కువ నీరుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు మైక్రో ఇరిగేషన్ విధానానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వర్సిటీ శంకుస్థాపనకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రైతులకు భూసార పరీక్ష కార్డులు అందజేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని రాధామోహన్ స్పష్టం చేశారు.