: ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఇజ్రాయెల్ జర్నలిస్టు!


పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న దాడులు.. ఇరు దేశాల పౌరులు బిక్కుబిక్కుమంటూ జీవితాలను గడుపుతున్న వైనం అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా వాసుల కత్తి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకుగాను తాజాగా ఒక కంపెనీ ఒక కోటును తయారు చేశారు. ఈ కోటు తొడుక్కుని ఉన్నప్పుడు కత్తి దాడి జరిగినప్పటికీ ఎటువంటి ప్రమాదం ఉండదని సదరు కంపెనీ పేర్కొంది. ఈ కోటుపై కథనం రాసేందుకు జర్నలిస్టు ఇతామ్ లాంకోవర్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అసలు ఆ కోటు పనితీరు ఏ విధంగా ఉందో పరీక్షించాలనుకున్నాడు. ఆ కోటును తొడుక్కున్న సదరు జర్నలిస్టు కెమెరా ముందు నిలబడ్డాడు. కత్తి చేతబట్టిన ఒక వ్యక్తి వెనుక నుంచి జర్నలిస్టును పొడిచాడు. తీరా చూస్తే, రక్షణగా నిలుస్తుందనుకున్న కోటు పని చేయలేదు. కోటును చీల్చుకుంటూ వెళ్లిన కత్తి జర్నలిస్టు నడుం పైభాగంలో గుచ్చుకుంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. కాగా, ఈ కోటు తయారు చేసిన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ యానివ్ మొంటాక్యో మాట్లాడుతూ, కత్తి దిగబడిన చోట ప్రొటెక్టివ్ మెటీరియల్ లేదని.. అందుకే ఇలా జరిగిందని అన్నారు. ఇంత జరిగినా, తాము తయారు చేసిన కోటు కత్తి దాడుల నుంచి రక్షణ కవచంగా నిలుస్తుందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదంటూ ఆయన గొప్పలు చెప్పుకోవడం విశేషం!

  • Loading...

More Telugu News