: డామిట్... 'కథ' అడ్డం తిరిగింది!... పోలీస్ కమిషనర్ కి దొరికిపోయాడు!
ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకే కట్టు కథలు చెప్పబోయి దొరికిపోయిన మాయగాడి కథ ఇది. విధులు ముగిసిన అనంతరం బస్సీ, మరో పోలీసు అధికారి కలిసి ఇంటికి వెళ్తున్నారు. వారి ముందు నుంచి ఒక కారు వెళ్లింది. ఆ కారుకు ఉత్తరప్రదేశ్ నంబరు ప్లేట్ ఉండటమే కాకుండా దానిపై ఢిల్లీ పోలీసు అని రాసి ఉంది. ఈ విషయాన్ని గమనించిన బస్సీ ఆ కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులో వ్యక్తులను పోలీసు అధికారులు ప్రశ్నించగా .. తన పేరు వివేకానంద శర్మ అని.. ఢిల్లీ విజిలెన్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నని చెప్పాడు. ఐడీ కార్డు చూపించాలని సదరు పోలీసు అధికారులు కోరగా, వెంటనే అతను మాట మార్చాడు. తాను లాయర్ నని, కారు నడుపుతున్న మహిళ తన భార్య అని.. బంధువుల ఇంటికి వెళ్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. అనుమానాస్పద సమాధానాలు చెబుతుండటంతో బస్సీ స్థానిక పోలీసులను విచారణకు ఆదేశించారు. వెంటనే విజిలెన్స్, పోలీసు శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని విచారించగా అతడు నోయిడాకు చెందిన వాడని, కారు అతనిది కాదని తేలింది. నిందితుడిని అరెస్టు చేసి లాకప్ కు తరలించారు.