: కాపు కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మంజునాథ్?.. అధికారిక ప్రకటనే తరువాయి
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల నాడు ఇచ్చిన హామీకి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కట్టుబడ్డారు. ఇప్పటికే కాపులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన కాపు కార్పొరేషన్ కు అంకురార్పణ చేసిన చంద్రబాబు, దానికి నిధులతో పాటు చైర్మన్ ను కూడా నియమించారు. ఇక కాపులకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వివిధ సామాజిక వర్గాలు, ప్రత్యేకించి బీసీల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు చంద్రబాబు కార్యరంగాన్ని సిద్ధం చేశారు. కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనానికి ఏపీ కాపు కమిషన్ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎల్ మంజునాథ్ అధ్యక్షతన ఈ కమిషన్ త్వరలోనే అధ్యయనం ప్రారంభించనుంది. ఈ మేరకు ఏపీ కాపు కమిషన్ చైర్మన్ పదవికి మంజునాథ్ ను చంద్రబాబు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నేడో, రేపో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.