: ఉత్తర కొరియాలో భూకంపమా... అణు పరీక్షా?
ఉత్తర కొరియాలో ఈ తెల్లవారుఝామున సంభవించిన ఒక భూకంపం చైనా అధికారులను సందేహంలో పడేసింది. ఉత్తరకొరియా మరో మారు అణు పరీక్షలను నిర్వహించి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. చైనా భూకంపం నెట్ వర్క్ సెంటర్ దీనిని అనుమానాస్పద పేలుడుగా గుర్తించింది. ఇది అణు పరీక్షా? లేక భూకంపమా? అనేది ఇంకా వెల్లడి కాలేదు. ఉత్తర కొరియాలో భూకంపాలు అంతగా తలెత్తే అవకాశం లేదని యూరోపియన్ భూకంప కేంద్రం తేల్చిచెప్పిన దరిమిలా తాజాగా సంభవించిన భూకంపంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఉత్తర కొరియా నాలుగోసారి అణు పరీక్షలు నిర్వహించిందన్న అనుమానాలు మొలకెత్తుతున్నాయి. అయితే, ఉత్తర కొరియా అధికారులు ఇంతవరకూ దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం.