: అందమైన పిల్లి కిడ్నాప్ కథ!
సాధారణంగా మనుషుల్ని కిడ్నాప్ చేయడం మనం చూస్తుంటాం. అయితే, అందుకు భిన్నంగా పాకిస్థాన్ లో ఓ పిల్లి కిడ్నాప్ అవడం సంచలనం రేపుతోంది. పాకిస్తాన్ లోని తెహ్రిక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్త ఇంతియాజ్ అసిఫ్ కు చెందిన పిల్లిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పీఎంఎల్-ఎన్ పార్టీలో చేరాలంటూ తనపై కొంతకాలంగా ఈ ముగ్గురు వ్యక్తులు ఒత్తిడి తెస్తున్నారని, ఈ నేపథ్యంలో వారు తన పిల్లిని కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని డాన్. కామ్ లో ఆమె తెలిపింది. తమ సమీపంలో నివసించే సదరు వ్యక్తులు తన పిల్లి స్వేచ్ఛగా తిరగడాన్ని గమనించి దానిని కిడ్నాప్ చేశారని ఆరోపించింది. సోమవారం నాడు ఒక పిల్లిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని తనకు చూపించారని, ఆ పిల్లి తనది కాదని ఇంతియాజ్ పేర్కొంది. తనను పార్టీ మారాలంటూ కొంతమంది వ్యక్తులు తనకు తరచుగా ఫోన్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె చెప్పింది. పిల్లి కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండేళ్ల క్రితం ఇస్లామాబాద్ లోని డీ-చౌక్ లో జరిగిన పీటీఐ సమావేశాలకు ఈ పిల్లితో పాటు ఆమె హాజరైంది.