: చంద్రబాబూ.. మా కులం తప్పా ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చా?: ముద్రగడ పద్మనాభం
‘తమరి పరిపాలనలో మా జాతి తప్పా ఎవరైనా కుల సమావేశం పెట్టుకోవచ్చా?’ అని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు మరోమారు ఘాటుగా ఆయన లేఖ రాశారు. ‘మీ సొంత సామాజిక వర్గం తరచుగా కుల సమావేశాలు పెట్టుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదా? మా జాతి తాలిబాన్ టెర్రరిస్టుల్లాంటి వారా? లేక ఏ దేశం నుంచైనా తన్ని తరిమేస్తే వచ్చిన వారమా? ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్లు, ఏటా రూ.1000 కోట్లు ఇచ్చి ఆదుకుంటానన్న హామీ వల్లే మీరు గద్దెనెక్కారు. 1910 నుంచి 1956 వరకు, 1961 నుంచి 1966 వరకు మా కాపు జాతి అనుభవించిన బీసీ రిజర్వేషన్లను వెంటనే పునరుద్ధరించాలి.. ఈ జాతిని మోసం చేయకండి’ అంటూ ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాపు బహిరంగ సభ నిర్వహిస్తామని, తాము తిరగబడితే వారికి పుట్టగతులుండవని అన్నారు. ఒక దినపత్రికలో తనపై వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని.. దమ్ముంటే తన పేరుతోనే వార్తలు రాయించాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు.