: ప్రణవ్ కు కత్తిమీద సామే: ధోనీ
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లెవెల్ టోర్నమెంట్ లో కేసీ గాంధీ స్కూల్ తరపున బరిలోకి దిగి ఆర్యా గురుకుల్ పాఠశాల జట్టుపై 1009 పరుగులు చేసిన ప్రణవ్ ధనవాడేను టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభినందించాడు. ముంబైలో ధోనీ మాట్లాడుతూ, కొత్తగా ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ప్రణవ్ కు తల్లిదండ్రులు, కోచ్ అండగా నిలవాలని సూచించాడు. ప్రణవ్ కు ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చేస్తుందని, ఎక్కడికి వెళ్లినా అంతా గుర్తుపడతారని, పలువురు అభినందనలతో ముంచెత్తుతారని, అవేవీ తలకెక్కించుకోకుండా ఉండగలిగితే ప్రణవ్ అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదుగుతాడనడంలో సందేహం లేదని ధోనీ స్పష్టం చేశాడు. అలా కాకుండా అంతా ప్రత్యేకంగా చూస్తున్నారని ఏ మాత్రం గర్వం ప్రదర్శించినా అద్భుతమైన భవిష్యత్ నాశనమైపోతుందని ధోనీ తెలిపాడు. అంత స్కోరు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని, దానిని అంతా గుర్తించుకోవాలని, నేడు ప్రణవ్ సాధించిన ఘనత అనితర సాధ్యమైనదని ఆయన తెలిపాడు. ఈ పరిస్థితులను నెగ్గుకురావడం ప్రణవ్ కు కత్తిమీద సామేనని ధోనీ అభిప్రాయపడ్డాడు.