: నెరవేరనున్న కల.. హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం!
నాలుగు జిల్లాల ప్రజల కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్-తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. నడికుడి-శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నిమిత్తం రూ. 271.06 కోట్ల నిధుల విడుదలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వేలైన్ నిర్మాణం నిమిత్తం సుమారు 2,900 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించాల్సి ఉంటుంది. 308 కిలో మీటర్ల బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుంది. నడికుడి నుంచి కారంపూడి మీదుగా శావల్యాపురం వద్ద గుంటూరు- గుంతకల్లు లైన్ కు కలిసే మార్గం దొనకొండ వద్ద విడిపోయి, డేకనకొండ, దర్శి, పొదిలి, గార్లపేట, కనిగిరి, పామూరు, వింజమూరు ప్రాంతాల మీదుగా ప్రయాణించి వెంకటగిరి వద్ద విజయవాడ-చెన్నై లైన్ కు కలుస్తుంది. ఈ లైన్ కోసం దశాబ్దాలుగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ మార్గం కనుక పడితే హైదరాబాద్-తిరుపతి మధ్య సుమారు 100 కిలోమీటర్ల వరకు దూరం తగ్గిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఒక రూట్లోను; నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా మరో రూట్లోను తిరుపతి వెళ్లే రైళ్లు ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే.