: పదేళ్లప్పుడు పేపర్ బాయ్ గా పనిచేశాను: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
నేటి తరం చిన్నారులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకునే సరికి వారికోసం అమరావతి ప్రాంతంలో అపార ఉద్యోగావకాశాలు సిద్ధంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. చదువుతో ఎంతటి ఉన్నత స్థానానికైనా వెళ్లవచ్చని, పేదరికం ఎంతమాత్రమూ చదువుకు అడ్డంకి కాదని అన్నారు. తాను అమెరికాలో పదేళ్ల వయసులో ఐదవ తరగతి చదువుతున్నప్పుడు పేపర్ బాయ్ గా పనిచేశానని, ఆపై ఓ దుస్తుల షాపులోనూ కొంతకాలం పాటు పనిచేశానని జయదేవ్ గుర్తు చేసుకున్నారు. అమరావతి ప్రాంతంలో పలు పాఠశాలల్లో కట్టించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటి పరిస్థితులు ఎలాగున్నా, మనోధైర్యంతో ముందడుగు వేసి అనుకున్నది సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.