: తెలంగాణలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ.41వేల కోట్లు కేటాయించాం: గడ్కరీ
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రోడ్ల అభివృద్ధి కోసం రూ.41 వేల కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాష్ట్ర పర్యటన నిమిత్తం ఈరోజు ఆయన హైదరాబాద్ వచ్చారు. అనంతరం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవేలకు రూ.16వేల కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ లో జలరవాణా వ్యవస్థకు నావిగేషన్ రిపోర్టు ఇవ్వమని ప్రభుత్వానికి చెప్పినట్టు తెలిపారు. ఈ జలరవాణా వ్యవస్థ ద్వారా నేషనల్ హైవే, ఎయిర్ వే, రైల్వే కనెక్టివిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.