: షాడో మంత్రిగా లాలూ!... నాడు భార్యకు, నేడు పెద్ద కొడుక్కి!
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగానే కాక కేంద్ర రైల్వే శాఖ మంత్రిగానూ తనదైన శైలిలో సత్తా చాటారు. నష్టాల్లో ఉన్న భారతీయ రైల్వేలను లాభాల బాట పట్టించిన ఘనత ఆయనదే. అయితే, దాణా కుంభకోణంలో ‘గడ్డి’ మేసిన లాలూ, ఆ తర్వాత రాజకీయాలకు అనర్హుడిగా మారిపోయారు. ఫలితంగా అప్పటిదాకా గృహిణిగా కాలు బయటపెట్టని ఆయన సతీమణి రబ్రీదేవీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. భర్త జైల్లో ఉంటే, ఆమె బీహార్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. జైల్లో ఉన్నా, భార్య బాధ్యతలన్నీ లాలూనే నడిపారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీతో చేతులు కలిపిన లాలూ ఘన విజయం సాధించారు. తనకు ఎటూ అవకాశం లేకపోవడంతో ఇద్దరు కుమారులను రాజకీయ తెరంగేట్రం చేయించారు. ఇద్దరినీ గెలిపించుకున్నారు. వారిలో చిన్నోడు తేజస్వీ యాదవ్ ను డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చోబెట్టి, పెద్దోడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇప్పించుకున్నారు. చిన్నోడి కంటే పెద్దోడు కాస్తంత డల్ అని లాలూనే చెప్పారు. మరి పాలనా వ్యవహారాల్లో పెద్దోడు ఎలా రాణిస్తారనుకున్నారో, ఏమో కాని... లాలూ తన కొడుక్కు షాడో మంత్రిగా మారిపోయారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని ఇందిరా గాంధీ మెడికల్ ఇన్ స్టిట్యూట్ లో నిన్న ఆయన తనిఖీలు నిర్వహించారు. ఓ రోగిని పరామర్శించేందుకే తాను ఆసుపత్రికి వెళ్లానని లాలూ చెప్పినా, ఆయన వ్యవహార సరళిని క్షణాల్లో గ్రహించిన వైద్యులు ఆయన అడిగిన సమాచారమంతా చెప్పేసి బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.