: హైదరాబాద్ లో అందరూ ఒకటే, ఓటేయడం వేయకపోవడం వారి విజ్ఞత: కేటీఆర్
హైదరాబాద్ లోని ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ దృష్టిలో సమానులేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. టీఆర్ఎస్ గెలిస్తే, ఆంధ్రావారిపై దాడులు జరుగుతాయని, సెటిలర్లు సామాన్లు సర్దుకొని వెళ్లాల్సి వస్తుందని రాష్ట్ర విభజనకు ముందు పలు పార్టీల వారు భయాందోళనలకు గురి చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క ఘటన కూడా జరగలేదని ఆయన గుర్తు చేశారు. సెటిలర్లంతా తమవైపే ఉన్నారని వ్యాఖ్యానించిన ఆయన, విజ్ఞత గల ఓటర్లు తమకే ఓటేస్తారని జోస్యం చెప్పారు. అభివృద్ధికి కట్టుబడి, సెటిలర్లకు అండగా ఉండే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం, వేయకపోవడం అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ పార్టీదేనని, ఇందులో సందేహం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.