: కోట్ల రూపాయలు మెక్కేసిన 120 మంది అవినీతి అధికారులను వదిలేసిన బాబు సర్కారు!
రాజకీయనాయకుల నుంచి వచ్చిన ఒత్తిడుల ఫలితమైతేనేమి, సదరు అధికారులు పార్టీకి అండగా నిలుస్తారన్న ఆలోచనతో అయితేనేమి... దాదాపు 120 మంది అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలను తీసుకోకుండానే చంద్రబాబు సర్కారు వదిలేసింది. వీరందరిపైనా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం కేసులు పెట్టినప్పటికీ, వాటన్నింటినీ తొలగించింది. లంచాలు తీసుకోవడం, అక్రమంగా నిధుల మళ్లింపు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం వంటి అంశాల్లో వీరిపై కేసులు నమోదు కాగా, వీటన్నింటినీ ప్రభుత్వం పక్కన పెట్టింది. గత ఏడాదిన్నరలో ఈ తరహా కేసులు 120కి పైగానే ఉండటం గమనార్హం. ఏపీ గృహ నిర్మాణ శాఖలో భాగంగా ఉన్న పంచాయతీ రాజ్ విభాగంలో ప్రైవేటు కార్యదర్శిగా పని చేస్తున్న ఉద్యోగి రూ. 75 లక్షలను అక్రమంగా తరలించిన కేసులో అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేయగా, అతనిపై ఉన్న కేసులను బాబు సర్కారు తొలగించింది. విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలంలో పనికి ఆహార పథకంలో ఆరోపణలు వచ్చిన అధికారిపై తదుపరి చర్యలు వద్దని ఏకంగా ఓ జీవోను (నవంబర్ 11, 2015, ఆర్టీ నంబర్. 1064) విడుదల చేసింది. ఇక గుంటూరు జిల్లాలో స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన కింద వ్యక్తిగత రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన ఓ అధికారిపైనా చర్యలు వద్దని జీవో జారీ చేసింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నుంచి వచ్చిన ఒత్తిడే ఇందుకు కారణమని సమాచారం. అనంతపురంలో సర్వ శిక్షా అభియాన్ కింద పిల్లలకు అవసరమైన పుస్తకాలు తదితరాలను కొనుగోలు చేయాల్సిన అధికారి ఒకరు ఆ నిధులను మెక్కేసినా, ఓ మంత్రి సహాయంతో బయటపడ్డాడు. ఇతన్ని విధుల నుంచి తొలగించాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసినా అవి బుట్టదాఖలయ్యాయి. ఇక ఇరిగేషన్ విభాగంలో చేపట్టిన పులివెందుల బ్రాంచ్ కెనాల్ పనుల్లో రూ. 25 కోట్లు నొక్కేసిన ఇద్దరు అధికారులపైనా తదుపరి చర్యలు వద్దని నవంబర్ 19న ఓ జీవో విడుదలైంది. కర్నూలులో రూ. 2 కోట్లు నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చిన ఇద్దరు డివిజనల్ ఇంజనీరింగ్ స్థాయి అధికారులపై క్రమశిక్షణా చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సిఫార్సు చేయగా, జిల్లా మంత్రి ఒత్తిడితో బయటపడిపోయారు. "రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వెల్ఫేర్ విభాగాల్లో అత్యధిక లంచాల కేసులు నమోదయ్యాయి. వారిపై ఆరోపణలు నమోదు చేయడం మినహా, మరేమీ చర్యలు తీసుకోలేకపోతున్నాం" అని ఓ సీనియర్ అధికారి వివరించారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. బయటపడ్డ కేసులు తక్కువే. వెలుగులోకి రాని నిధుల మళ్లింపులు ఎన్నో... ఇక ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో?!