: అంత పెద్ద అవమానం జరుగుతుందని అనుకోలేదు: మిస్ కొలంబియా


మిస్ యూనివర్స్ వేదికపై తనకు అంత పెద్ద అవమానం జరుగుతుందని భావించలేదని ఆ పోటీ రన్నరప్, మిస్ కొలంబియా అరియాడ్నా గుటిరెజ్ పేర్కొంది. గత డిసెంబర్ లో అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఫైనల్ పోటీలో విజేత ప్రకటన సందర్భంగా తప్పిదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె నేడు స్పందించింది. గతేడాది జీవితంలో ఊహించని ఘటన జరగిందని, మిస్ యూనివర్స్ పోటీల్లో తనకు అన్యాయం జరిగిందని ఆమె పేర్కొంది. ఆ ఘటన జరిగిన అనంతరం తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. ఆ రోజు విశ్వ సుందరిగా ఎంపికయ్యానని ప్రకటిస్తూ కిరీటం తొడిగారని, ఆ ఆనందంలో ఉండగానే స్టీవ్ హార్వే తాను పొరపాటు చేశానని ప్రకటించగానే ఆయన జోక్ చేస్తున్నారని భావించానని ఆమె తెలిపింది. అయితే నిజంగానే తన నుంచి కిరీటం లాగేసుకున్నారని ఆమె ఆ నాటి ఘటనను గుర్తు చేసుకుంది. ఆ పొరపాటు వల్ల తనకు అవమానం జరిగిందని ఆమె పేర్కొంది. కాగా, ఆ నాటి ఘటనకు యాంకర్ గా పని చేసిన స్టీవ్ హార్వే విన్నర్ ను రన్నర్ గానూ, రన్నర్ ను విన్నర్ గా ప్రకటించి తప్పు చేశారు. దీంతో ముందుగా మిస్ కొలంబియా గుటిరెజ్ కు కిరీటం తొడిగి, తరువాత తప్పును గుర్తించి, సరి చేస్తూ మిస్ ఫిలిప్పీన్స్ పియా అలోన్జో పుర్జుబాక్ ను విశ్వసుందరిగా ప్రకటించారు. దీంతో గుటిరెజ్ కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News