: ఎయిర్ బేస్ లో రెండు భారీ పేలుళ్లు... మరో వైమానిక దళ అధికారి మృతి


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డ ఉగ్రవాదుల్లో నలుగురు హతమైనా, మరో ఇద్దరు ఉగ్రవాదులు మాటు వేసి దెబ్బ తీస్తున్నారు. నేటి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఎయిర్ బేస్ పై మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులు నేరుగా ఎయిర్ బేస్ లోకి చొచ్చుకెళ్లారు. అయితే వేగంగా స్పందించిన భద్రతా దళాలు కౌంటర్ అటాక్ చేసి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో నేటి ఉదయమే ఇద్దరు ఎయిర్ ఫోర్స్ అధికారులు చనిపోగా, తాజాగా మరో వైమానిక అధికారి అసువులు బాశారు. భద్రతా దళాల ప్రతిదాడితో ఎయిర్ బేస్ లో దాక్కున్న ఉగ్రవాదులు మాటు వేసి బీభత్సం సృష్టిస్తున్నారు. నలుగురు ఉగ్రవాదులు హతం కాగానే ఉగ్రమూకల నుంచి కొద్దిసేపు కాల్పుల శబ్దం ఆగిపోయింది. ఈ క్రమంలో మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సోదాలు ముమ్మరం చేశాయి. ఈ సమయంలోనే ఎయిర్ బేస్ లో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అంతేకాక మరో వైమానిక దళ అధికారి కూడా చనిపోయారు. దీంతో అప్రమత్తమైన సైనికాధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. తాజా పేలుడు శబ్దాలతో అక్కడ ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News