: ఎమ్మెల్సీ టికెట్ కు రూ.4 కోట్లివ్వమన్నారు!... కాంగ్రెస్ అధిష్ఠానానికి నిజామాబాదు అభ్యర్థి ఫిర్యాదు
టీ కాంగ్రెస్ లో పెను కలకలం రేగింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికలకు సంబంధించి నిజామాబాదు స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. బరి నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను సవివరంగా ప్రస్తావిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఓ లేఖ రాశారు. ఎమ్మెల్సీ బరిలో నిలవాలంటే రూ.4 కోట్ల మేర డిపాజిట్ చేయాలని టీ కాంగ్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మధు యాష్కీగౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు డిమాండ్ చేశారని రెడ్డి తెలిపారు. దీంతో రూ.2 కోట్లను షబ్బీర్ అలీ సమక్షంలోనే నేతల వద్ద డిపాజిట్ చేశానని ఆయన తెలిపారు. అయితే మిగిలిన రూ.2 కోట్లు కూడా డిపాజిట్ చేయాలని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లోనే విత్ డ్రా అయ్యానని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలెవరితోనూ తాను మాట్లాడలేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ నేతల నుంచి తాను సింగిల్ పైసా కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. డబ్బుల కోసం తనను వేధించి, పోటీ నుంచి తప్పుకునేలా చేసిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధినాయకత్వాన్ని కోరారు.