: రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు?... యూరప్ నుంచి తిరిగిరాగానే కొత్త బాధ్యతలు!
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు గాంధీ కుటుంబంలోని మలితరం నేతకు అప్పగించే కార్యక్రమానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. చాలాకాలంగా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ... ఇదివరకే తన కుమారుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని చూశారు. అయితే నాడు ససేమిరా అన్న రాహుల్ సరైన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తానని తల్లికి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి దాదాపు రెండు నెలల పాటు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత రాహుల్ మాటలో, ప్రత్యర్థులపై దాడిలో వాడి పెరిగింది. ఈ క్రమంలో ఇక మరింత ఆలస్యం చేయరాదన్న భావనతో పార్టీ అధిష్ఠానం రాహుల్ కు సూచించిందట. ప్రస్తుతం న్యూ ఇయర్ ను పురస్కరించుకుని యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ ఈ నెల 8 తర్వాత తిరిగి రానున్నారు. వచ్చీరాగానే ఆయన పార్టీ పగ్గాలు చేపడతారని ప్రచారం సాగుతోంది. రాహుల్ రాగానే పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ అయి ఈ మేరకు ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.