: కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ఆ దంపతుల పాలిట దేవుడయ్యారు!
కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ప్రాణదాతగా నిలుస్తున్నారు. రైల్వే మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన, రైల్వేల్లో ఏదైనా పొరపాటు జరిగినా, అత్యవసరం అయినా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సమస్యను వివరించవచ్చని, తక్షణం చర్యలు తీసుకుంటామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన ఆ ప్రకటన చేసినప్పుడు, 'అంతా ఇలాగే చెబుతారు' అంటూ ఈజీగా తీసుకున్నారు. ఆ తరువాత కేంద్ర మంత్రి నేరుగా రంగంలోకి దిగి పలువురు ఆపన్నులకు సహాయం చేసి గొప్పతనం చాటుకున్నారు. తాజాగా శంకర్ పండిట్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్య, నెలల బిడ్డ అయిన కుమార్తెతో కలిసి బీహార్ లోని కివుల్ ప్రాంతానికి భగల్పూర్-బెంగళూరు అంగా ఎక్సె ప్రెస్ లో బయల్దేరారు. మార్గ మధ్యంలో వారి కుమార్తెకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణం సాగే కొద్దీ పాప పరిస్థితి దారుణంగా తయారైంది. అందుబాటులో వైద్యసదుపాయాలు లేవు. దీంతో శంకర్ పండిట్ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో రైల్వేశాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాకు పరిస్థితి వివరిస్తూ ట్వీట్ చేశారు. దీనికి వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి తక్షణం సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో శంకర్ పండిట్ ఫోన్ నెంబర్ కు ఫోన్లు వెల్లువెత్తాయి. వారెక్కడున్నారో తెలుసుకుని అసన్ సోల్ స్టేషన్ లో వైద్యసిబ్బంది, అంబులెన్స్ తో సిద్ధంగా ఉన్నారు. రైలు స్టేషన్ చేరుకోగానే పాపకు ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. దీంతో కేంద్ర మంత్రి చేసిన మేలు జీవితంలో మర్చిపోలేమని, తమ పాపకు ప్రాణదానం చేశారని ఆ దంపతులు పేర్కొంటున్నారు. గతంలో కూడా కేంద్ర మంత్రి ఇలా చాలా మందిని ఆదుకున్న సంగతి తెలిసిందే.