: హైదరాబాద్ వచ్చిన పాక్ గాయక దిగ్గజానికి చుక్కలు!
హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మక ఫలక్ నుమా ప్యాలెస్ లో తన సుమధుర సంగీతాన్ని వినిపించాలని హైదరాబాద్ చేరుకున్న పాక్ సంగీత దిగ్గజం రహాత్ ఫతే అలీ ఖాన్ కు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు చుక్కలు చూపించారు. అబూదాబీ నుంచి ఆయన దిగగానే, తిరిగి అదే విమానంలో వెనక్కు పంపించారు. ఆయన ట్రావెల్ డాక్యుమెంట్లలో సాంకేతిక లోపాలున్నాయని అధికారులు తెలిపారు. ఎవరైనా పాకిస్థాన్ దేశస్తులు డైరెక్ట్ గా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగేందుకు నిబంధనలు అనుమతించవని చెప్పిన అధికారులు అలీ ఖాన్ ను తిరిగి అబూదాబీ విమానం ఎక్కించారు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై మెట్రో ఎయిర్ పోర్టుల నుంచి మాత్రమే పాక్ జాతీయులు ఇండియాలో కాలు పెట్టాల్సి వుంది. దీంతో సాయంత్రం 8 గంటలకు జరగాల్సిన అలీ ఖాన్ సంగీత ప్రదర్శన రాత్రి 11 గంటలకు వాయిదా పడగా, అలీ ఖాన్ తిరిగి అబూదాబీ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి, మరో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ముందు జరగాల్సిన సంగీత ప్రదర్శన, నూతన సంవత్సరం వచ్చిన తరువాత మొదలు కాగా, రాత్రి ఒంటి గంట వరకూ మాత్రమే వేడుకలకు అవకాశం ఉండటంతో, కొద్ది సేపు మాత్రమే అలీ ఖాన్ మధుర గానాన్ని వినే అవకాశం లభించింది.